చంద్రబాబు మెడపట్టి గెంటితే... జగన్ అక్కున చేర్చుకున్నారు: గొల్లపల్లి సూర్యారావు

  • టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
  • టీడీపీలో ఉన్నప్పుడు ఎంతో నిబద్ధతతో పనిచేశానని వెల్లడి
  • చంద్రబాబు, లోకేశ్ తన పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించారని ఆరోపణ
  • వైసీపీ కోసం శక్తివంచన లేకుండా పాటుపడతానని వెల్లడి
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇవాళ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. గొల్లపల్లికి సీఎం జగన్ స్వయంగా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గొల్లపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడారు. 

తాను టీడీపీలో ఉన్నప్పుడు ఎంతో నిబద్ధతతో పనిచేశానని, కానీ టీడీపీలో తాను దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నానని వివరించారు. చంద్రబాబు, లోకేశ్ తన పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తాను పార్టీకి అక్కర్లేదన్నట్టుగానే చూశారని వెల్లడించారు. 

అధికారం కోసం చూస్తున్న చంద్రబాబు మౌన మునిలా మారితే, లోకేశ్ దుర్మార్గమైన రీతిలో పార్టీని నడిపిస్తున్నాడని గొల్లపల్లి విమర్శించారు. చంద్రబాబు మెడపట్టి గెంటితే, బాధలో ఉన్న తనను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వైసీపీ కోసం శక్తివంచన లేకుండా పాటుపడతానని స్పష్టం చేశారు.

Gollapalli Surya Rao
YSRCP
Jagan
TDP
Chandrababu
Nara Lokesh

More Telugu News